క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా వచ్చిన ఉద్యోగాలు వదులుకోవడాన్ని వారు అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఓ ఏడాది పాటు విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నదే వేలాది మంది విద్యార్థుల ఆందోళన. ఒక్కసారి ఉద్యోగంలో చేరితే అకడమిక్‌గా ముందుకు సాగలేమనే ఉద్దేశంతోనే మెజారిటీ ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థులు ఉన్నత విద్యవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, అమెరికాలో కరోనా వైరస్ కేసులు లక్షల సంఖ్యలో నమోదు అవుతున్నందున అక్కడ విశ్వవిద్యాలయాలు జూన్ చివరి దాకా తెరుచుకునే అవకాశం లేదు. తిరిగి విశ్వవిద్యాలయాలు ఎప్పుడు పని చేస్తాయన్నది చెప్పడం కష్టమేనని, ఒకవేళ ఆగస్టు నాటికి మామూలు పరిస్థితులు నెలకొన్నా ఫాల్–2020 తరగతులు సెప్టెంబర్‌లో ప్రారంభం కావడం గగనమేనని యూనివర్సిటీ అఫ్ ఫ్లోరిడా గ్యాన్‌విల్లే అకడమిక్ విభాగం పేర్కొంది.
‘మీకు ఇచ్చిన అడ్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు. మీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు పూర్తయి మార్కుల జాబితా రాగానే మాకు పంపండి. ఫాల్ వీలు కాకపోతే స్ప్రింగ్–2021కి మీ అడ్మిషన్‌ను వాయిదా వేస్తాం’అని విద్యార్థులకు పంపిన కమ్యూనికేషన్‌లో స్పష్టం చేసింది. ‘యూనివర్సిటీ అఫ్ ఆరిజోనాలో (ఫాల్–2020) నాకు అడ్మిషన్ వచ్చింది. సెమిస్టర్ సమయం వృథా కాకుండా మామూలుగా సెప్టెంబర్ నుంచి ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తే మంచిదని నేను యూనివర్సిటీ అకడమిక్ విభాగానికి మెయిల్ పెట్టాను. ఫాల్‌కు ఆన్‌లైన్ పూర్తి చేస్తే స్ప్రింగ్ నాటికి హాజరు కావచ్చన్నది నా అభిప్రాయం. కానీ, అమెరికా నిబంధనల ప్రకారం ఒప్పుకోకపోవచ్చు’అని శ్రీనికేత్ శ్రీవాస్తన్ పేర్కొన్నారు.