నిజామాబాద్ లో ఉగ్ర మూకలు కలకలం రేపుతున్నాయి. ఐసిస్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో బోధన్ కు చెందిన తన్వీర్ అనే యువకుడిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేయడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బంగ్లాదేశ్ మూలాలు ఉన్న వ్యక్తులు బోధన్ చిరునామాతో పాప్ పోర్టు పొందిన ఘటన మరవకముందే ఏకంగా ఐసిస్ తో సంబంధాలున్న యువకుడు బోధన్ లో దొరకడం అందరినీ షాక్ గురి చేసింది. గతంలోనూ నిజామాబాద్ జిల్లాలో ఐఎస్ఐ నీడలు కనిపించాయి. బోధన్ రోహింగ్యాల పాస్ పోర్టు కేసు దర్యాప్తు కొలిక్కిరాకముందే ఉగ్రవాద మూలాలు ఉన్న యువకుడు పట్టుబడటం ఆందోళన కల్గిస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో ఉగ్రమూలాలు బయటపడటం ఇప్పుడే కొత్తకాదు గతంలోనూ బయటపడ్డాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఇక్కడ తలదాచుకున్న ఘటనలు వెలుగుచూశాయి. ఉగ్రవాదులతోపాటు స్లీపర్ సెల్స్ కూడా జిల్లాలో ఆశ్రయం పొందినట్లు, హైదరాబాద్ లో బాంబు పేలుళ్లకు పాల్పడిన వారిలో కొందరికి ఇక్కడి నుంచే సహకారం అందించినట్లు గతంలో వార్తుల వచ్చాయి. కరడుగట్టిన ఉగ్రవాది అజామ్ ఘోరిని జిల్లా పోలీసులు కాల్చి చంపారు. ఇక ప్రస్తుతం బోధన్ కేంద్రంగా బంగ్లాదేశీయులకు అక్రమంగా పాస్ పోర్టుల మంజూరు వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అంతలోనే మరో షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. బోధన్ పట్టణంలోని రేంజల్ బేస్ కు చెందిన తన్వీర్ ను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకుంది. అతనికి ఐసిస్ తో సంబంధాలున్నాయన్న దానిపై పక్కా ఆధారాలున్నాయి. తన్వీర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. రెండున్నరేళ్లుగా అక్కడే ఉంటూ ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే పాక్ యువకుడితో స్నేహం కుదిరింది. ఆ ఇద్దరు పాక్ తరపున గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానించిన సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
9 నెలల జైలు శిక్ష అనంతరం బెయిల్ పై బయటకొచ్చిన తన్వీర్ సౌదీ నుంచి పరారయ్యారు. అతను ఇండియా వెళ్లాడన్న నిర్ధారణతో ఇక్కడ ఐబీకి సమాచారం ఇచ్చారు. దీంతో బోధన్ లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేశారు. బోధన్ లోని రేంజల్ బేస్ క్యాంపులో అదుపులోకి ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
బోధన్ లో పోలీసులకు పట్టుబడ్డ తన్వీర్ ను రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సౌదీలో ఎవరితో ఉండేవాడు, పాక్ లో ఎవరితో సంబంధాలున్నాయి.. ఐసిస్ లో శిక్షణ తీసుకున్నాడా.. సౌదీ నుంచి భారత్ కు వచ్చేందుకు ఎవరు సహకరించారు.. ఇలా అన్ని కోణాల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు తన్వీర్ కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమారుడు అమాయకుడని, అతనికి ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సబంధాలు లేవని అంటున్నారు.