చార్‌ ధామ్‌ యాత్రతో సహా దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక రైలు

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు పర్యాటక ప్రదేశాలకు పర్యాటకు తరలివెళుతున్నారు. ఈ క్రమంలో చార్‌ ధామ్‌ యాత్రతో సహా దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక రైలును నడపాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. “చార్ ధామ్ యాత్ర” ను కొత్త సాధారణ పద్ధతిలో నిర్వహించాలనే ఉద్ధేశ్యంతో ఏసీ టూరిస్ట్‌ ట్రైన్‌ ద్వారా ‘చార్‌ధామ్‌ యాత్ర’ను ప్రారంభించింది. రామాయణ సర్క్యూట్‌లో నడుస్తున్న ‘శ్రీ రామాయణ యాత్ర’ రైలు ప్రజాదరణ పొందింది.దీంతో ఐఆర్‌సీటీసీ ‘దేఖో అప్నా దేశ్‌’ డీలక్స్‌ ఏసీ టూరిస్ట్‌ ట్రైన్‌ ‘చార్‌ధామ్‌ యాత్ర’ను ప్రారంభించాలని నిర్ణయించింది.
ఈ యాత్ర 16 రోజుల పాటు కొనసాగనుంది. ఢిల్లీలోని సఫ్ధర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సెప్టెంబర్‌ 18న రైలు బయలుదేరనుంది. ఈ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. బద్రీనాథ్‌తో పాటు చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న’మన’ గ్రామం, నర్సింగ్‌ ఆలయం (జోషిమత్‌) ఆలయం, పూరి గోల్డెన్ బీచ్, కోణార్క్ లోని సూర్యదేవాలయం, చంద్రభాగ బీచ్, ధనుష్కోడితో సహా రామేశ్వరం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, శివరాజ్‌పూర్ బీచ్, బెట్ ద్వారకతో సహా రిషికేశ్, జగన్నాథ్ పూరి ఆలయాలను ఈ యాత్రలో దర్శించుకోవచ్చు.

ఈ యాత్రలో భాగంగా ఈ రైలు సుమారు 8,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్‌లో చక్కటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలులో రెండు రెస్టారెంట్లు, ఒక ఆధునిక కిచెన్ రూమ్, రైలు కోచ్‌లో షవర్ క్యూబికల్స్, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్ ఫంక్షన్లు, ఫుట్ మసాజర్ వంటి చక్కటి సౌకర్యాలు ఉన్నాయి. ట్రైన్‌ మొత్తం ఎయిర్‌కండిషన్‌ కావటం మరో విశేషం. ఆయా స్థాయిలను బట్టి ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీలను రిజర్వు చేసుకోవచ్చు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైలులో ప్రతి కోచ్‌కు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

దేశీయ పర్యాటరంగాన్ని ప్రోత్సహించాలని ప్రధాని మోడీ పదే పదే పిలుపునిస్తుంటారు. దీని ద్వారా ఆయా రాష్ట్రాలకు ఆర్థికాభివద్ధి పెరిగే అవకాశమిచ్చినట్లు అవుతుందని ప్రధాని చెబుతుంటారు. ఈ క్రమంలో దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే భాగంగా కేంద్ర ప్రభుత్వం చొరవ ‘దేఖో అప్నా దేశ్’కు అనుగుణంగా ప్రత్యేక రైలును ఐఆర్‌సీటీసీ ప్రారంభిస్తోంది.

ఈ ట్రైన్ లో ప్రయాణించటానికి ప్యాకేజీ ధరను రూ.78,585కు నిర్ణయించారు. రైలు ప్రయాణం, డీలక్స్‌ హోటళ్లలో వసతి, భోజనం, ఆయా ప్రాంతాలకు వెళ్లటానికి వాహనాల సౌకర్యం, ఆలయాల్లో దర్శనం, అలాగే ప్రయాణంలో ఏమన్నా జరిగితే ఆయా వ్యక్తులకు ప్రయాణ బీమా వంటి పలు రకాల వసతులను ఐఆర్‌సీటీసీ కల్పించనుంది. ఈ డీలక్స్ టూరిస్ట్ రైలులో కరోనా కేసులు తగ్గుతున్నా..భద్రతను..కరోనా నిబంధనలను దృష్టిలో పెట్టుకుని కేవలం 120 మందికే అవకాశం కల్పిస్తోంది. ఈ రైలులో రిజర్వు చేయించుకోవాల్సిన వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాల్సిందే. ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ గ్లోవ్స్, శానిటైజర్ పర్యాటకులందరికీ ఐఆర్‌సీటీసీ నే కిట్లను అందించనుంది. కాగా..ఈ రైలులో రిజర్వు చేయించుకోవాలనుకునేవారు..కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాల కొనసాగుతున్న క్రమంలో 18 సంవత్సరాలు దాటిన వారందరు కనీసం ఒక మోతాదు టీకా తీసుకొని ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *