సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కి కోపమొచ్చింది. దానికి కారణం ఓ రీమిక్స్ పాట. ‘ఢిల్లీ6’ సినిమా కోసం ‘‘మసక్కలీ మసక్కలీ..’ అనే పాటను రెహమాన్ కంపోజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ పాట బ్లాక్ బస్టర్. సినిమా క్రేజ్‌ని రెండింతలు చేసిన పాట అది. తాజాగా ‘మసక్కలీ 2.0’ అంటూ ఆ పాటను మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బగ్చి రీమిక్స్ చేశారు. ‘నాకు రీమిక్స్ పాటల సంçస్కృతి నచ్చదు’ అని పలు సందర్భాల్లో రెహమాన్ చెప్పారు. తాజాగా ఈ ‘మసక్కలీ 2.0’ ఆయన్ను అసహనానికి గురి చేసినట్టుంది.
అందుకే తన ట్వీటర్‌లో ‘ఒరిజినల్ పాటల్నే ఎంజాయ్ చేయండి’ అని ట్వీట్ చేశారు. అలాగే ‘ఎన్నో నిద్ర లేని రాత్రులు పాటల్ని రాస్తూ, నచ్చకపోతే మళ్లీ రాసి, సుమారు 200 మంది సంగీత కళాకారులు 365 రోజులు గొప్ప సంగీతాన్ని అందించాలని కృషి చేస్తేనే తరాలు నిలబడే పాట పుడుతుంది’ అని చిన్న లేఖ కూడా జత చేశారు. అది మాత్రమే కాదు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కోపాన్ని నియంత్రించుకునేవారే నిజమైన మనిషి’ అంటూ ఓ ఫొటో షేర్ చేశారు. సాధారణంగా చాలా సౌమ్యంగా ఉండే రెహమాన్ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారంటే ఆయన ఎంత అప్ సెట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.