దేశంలో రైతులకు శుభవార్త చెప్పింది మోదీ సర్కార్. వారి కోసం ‘ధన్ ధాన్య కృషి యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రస్తావించిన ప్రభుత్వం, బుధవారం కేబినెట్లో నిధులు కేటాయించడం ఈ పథకం అసలు ఉద్దేశం ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి కేంద్రం తీసుకొస్తున్న పథకం ధన్-ధాన్య కృషి యోజన. ఈ పథకం 6 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. దేశంలోని 100 జిల్లాలను కవర్ చేస్తుంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన మొట్ట మొదటిది.
వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం అందులో కీలకమైనవి. పంచాయతీ-బ్లాక్ స్థాయిలలో పంట కోత తర్వాత నిల్వను పెంచడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం మరో పాయింట్. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణ లభ్యతను సులభతరం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
ఈ పథకం కేంద్ర పరిధిలోని 11 విభాగాల పరిధిలోని 36 పథకాలు అనుసంధానం చేయనుంది. ఇతర రాష్ట్ర పథకాలు, ప్రైవేట్ రంగంతో స్థానిక భాగస్వామ్యం ద్వారా అమలు చేయబడుతుంది. తక్కువ ఉత్పాదకత, తక్కువ పంట తీవ్రత, తక్కువ రుణ పంపిణీ ఈ మూడు సూచికల ఆధారంగా దేశంలోని 100 జిల్లాలను గుర్తించనున్నారు.
ఈ పథకం ద్వారా 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రతీ రాష్ట్రంలో ఓ జిల్లాను ధన్ ధాన్య యోజన పథకం కింద వ్యవసాయ జిల్లాగా అభివృద్ధి చేస్తామన్నది కేంద్రం మాట. ఈ పథకాన్ని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనుంది కేంద్రం. దాని పురోగతిని 117 పెర్ఫామెన్స్ ఇండికేటర్ల ద్వారా పర్యవేక్షణ జరగనుంది.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఈ ప్రణాళికను రూపొందించనుంది. ఉత్పత్తి-ఉత్పాదకత పరంగా అత్యంత వెనుకబడిన జిల్లాలను.. అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా తీసుకురావడమే దీని ఉద్దేశం. ఇది స్వావలంబనదేశం లక్ష్యాన్ని సాధించడాన్ని సులభతరం చేయనుంది. ఉత్పాదకత పెరిగితే, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది.
రైతుల పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో విలువ జోడింపు ఉంటుంది. స్థానిక స్థాయిలో ఉపాధి పెరుగుతాయి. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ పరిష్కరించే రాష్ట్రాలు, జిల్లాల మధ్య ఉత్పాదకతలో తేడాలు ఉన్నాయి.
ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకానొక సందర్బంలో చెప్పారు. ఈ పథకం అమలైతే దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పెను మార్పులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.