నైరుతి రుతుపవనాలు గత ఏడాదితో పోల్చితే త్వరగానే వచ్చినా వర్షపాతం మాత్రం కాస్త తక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకు ఉపరితలద్రోణి ఏర్పడింది. మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ ఉపరితల ద్రోణుల ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. జులై నెలలో ఓ మోస్తరుగా వర్షాలు కురిస్తే, ఆగస్టులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మంచిర్యాల ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అలర్ట్ చేసింది.