ముంబైలో టెస్లా కార్ల షోరూం ప్రారంభం..!

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ భారతదేశంలో తన మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న మార్కర్ మ్యాక్సిటీ మాల్‌లో షోరూమ్‌ను తెరవడం ద్వారా ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది.

 

ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. టెస్లా సంస్థకు భారతదేశంలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. అంతేకాకుండా, భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఫడ్నవీస్ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ కార్లు భారతీయ మార్కెట్‌ను పూర్తిగా మార్చబోతున్నాయని అన్నారు. ముంబై నగరం ఎల్లప్పుడూ ఆవిష్కరణలకు, స్థిరత్వానికి ప్రసిద్ధి అని కొనియాడారు. తాను 2015లో మొదటిసారి టెస్లా కారులో ప్రయాణించానని, భారత్‌లో ఇలాంటి వాహనం ఎంతో అవసరమని అప్పుడే భావించానని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

 

టెస్లా భారతదేశానికి రావడానికి పదేళ్లు పట్టిందని, ముంబై ప్రజలు, భారతీయులు టెస్లాను తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో టెస్లాకు మంచి మార్కెట్ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అందుకు అనుగుణంగా విధానాలను రూపొందించిందని తెలిపారు.

 

షోరూమ్ ప్రారంభం శుభసూచకమని, భవిష్యత్తులో భారతదేశంలో అన్ని రకాల పరిశోధనలు, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. టెస్లా సంస్థ కూడా ఆ దిశగా ఆలోచిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *