మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ కానున్నాయి. బస్టాపులతో పాటు మహిళలు ఎక్కడైనా సరే రాత్రి 7.30 తర్వాత చెయ్యెత్తి బస్సు ఆపవచ్చని, అవసరమైన చోట ఆపి దిగి వెళ్లిపోవచ్చని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని 29 డిపోలకు చెందిన మేనేజర్‌లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
మహిళలు ఎక్కువ సమయం బస్టాపుల్లోనే వేచి ఉండకుండా.. బస్సు కోసం ప్రత్యేకంగా బస్టాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. మహిళా ప్రయాణికులు కోరిన చోట బస్సు ఆపకపోతే డిపో మేనేజర్‌లకు ఫిర్యాదు చేయొచ్చు. అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు అన్ని బస్సుల్లో డిపో మేనేజర్ల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచనున్నట్లు ఈడీ చెప్పారు.