లాక్ డౌన్ సమయాల్లో కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు స్టార్స్. ఒకరు గరిటె పట్టుకుని వంట గదిలోకి అడుగుపెడితే, మరొకరు యోగా మ్యాట్ మీద ధ్యానంపై దృష్టి పెడుతున్నారు. నిత్యా మీనన్ తనలో ఉన్న కథకురాలిని బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారట. కథలు వండే పని మీద ఉన్నారు. ఈ విషయం గురించి నిత్యా మీనన్ మాట్లాడుతూ –‘‘లాక్ డౌన్ వల్ల పరిసరాలు ఎంతో ప్రశాంతంగా మారిపోయాయి. ఈ ప్రశాంతతని ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే కొన్ని కథలు సిద్ధం చేస్తున్నాను. కొంత కాలంగా నా మైండ్‌లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యాక్టర్‌గా బిజీగా ఉండటంతో కథలు డెవలప్ చేయలేకపోయాను. వాటిని అభివృద్ధి చేయడానికి ఇది బెస్ట్ టైమ్. వీటితో పాటు కొత్త భాష నేర్చుకుంటున్నాను. సంగీతం కూడా నేర్చుకుంటున్నాను. యోగా చేస్తున్నాను’’ అన్నారు.