నెపోటిజంపై మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు..

చిత్ర పరిశ్రమలో వారసత్వం, నెపోటిజంపై ఎప్పటినుంచో జరుగుతున్న చర్చపై నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నేపథ్యం ఉన్నంత మాత్రాన విజయాలు వాటంతట అవే రావని, పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. యంగ్ హీరో సుహాస్ నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకకు హాజరైన మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పరిశ్రమలో వారసత్వ నటులకే అవకాశాలు దక్కుతాయనేది ఒక అపవాదు మాత్రమే. సినిమా నేపథ్యం అనేది కేవలం పరిశ్రమలోకి రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక్కడ నిలబడాలంటే ప్రతిభను నిరూపించుకోవాలి, ప్రేక్షకుల ఆదరణ పొందాలి. అప్పుడే ఎవరైనా రాణించగలరు” అని అన్నారు. పెద్ద బడ్జెట్ చిత్రాలు, మల్టీస్టారర్ సినిమాలు విజయాన్ని నిర్ణయించలేవని ఆయన అభిప్రాయపడ్డారు.

 

నటుడు సుహాస్ ప్రయాణాన్ని మనోజ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. “యూట్యూబ్ నుంచి కెరీర్ మొదలుపెట్టి, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు హీరో స్థాయికి ఎదగడం సుహాస్ కష్టానికి నిదర్శనం. అతని ప్రయాణం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. తమిళ నటుడు విజయ్ సేతుపతిలా ఒకవైపు హీరోగా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించడం అభినందనీయం” అని కొనియాడారు.

 

కాగా, సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా జులై 11న థియేటర్లలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *