మిమ్మల్ని ఎలా నమ్మాలి..?ట్రంప్‌పై ఎలాన్ మస్క్ సూటి ప్రశ్న..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన కీలక దస్త్రాలను (ఎప్స్టీన్ ఫైల్స్) ప్రభుత్వం ఎందుకు తొక్కిపెడుతోందంటూ మస్క్ నేరుగా ట్రంప్‌ను నిలదీయడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

“ఎప్స్టీన్ ఫైల్స్‌ను ట్రంప్ విడుదల చేయకపోతే ప్రజలు ఆయన్ను ఎలా నమ్ముతారు?” అంటూ మస్క్ మంగళవారం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా నేరుగా ప్రశ్నించారు. అంతేకాకుండా తాను కొత్తగా స్థాపించిన ‘అమెరికా పార్టీ’ అధికారంలోకి వస్తే ఈ కుంభకోణాన్ని బయటపెట్టడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.

 

ఇటీవల అమెరికా న్యాయశాఖ (డీఓజే) ఈ కేసుపై కీలక ప్రకటన చేసింది. ఎప్స్టీన్ నివాసాలు, ప్రైవేట్ ద్వీపంలో సోదాలు చేసినా ఎలాంటి ‘క్లయింట్ లిస్ట్’ దొరకలేదని, ఈ కేసుకు సంబంధించి ఇకపై ఎలాంటి సమాచారం వెల్లడించబోమని స్పష్టం చేసింది. ఈ ప్రకటనపైనే మస్క్ తీవ్రంగా స్పందించారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఇదే అంశంపై ట్రంప్‌ను ప్రశ్నించగా, ఆయన ఆ విషయాన్ని దాటవేశారు. “మీరు ఇంకా ఎప్స్టీన్ గురించే మాట్లాడుతున్నారా?” అని విలేకరిని ఎదురు ప్రశ్నించారు.

 

అయితే, గతంలో ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీ ఇద్దరూ ఎప్స్టీన్ నెట్‌వర్క్‌ను బయటపెడతామని హామీ ఇచ్చారు. ఆ జాబితా తన డెస్క్‌పై ఉందని బోండీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఇప్పుడు న్యాయశాఖ అందుకు భిన్నంగా ప్రకటన చేయడంతోనే మస్క్ వంటి వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *