న్యూయార్క్‌ ఆస్పత్రుల్లో ఎటు చూసినా శవాలే…

అది న్యూయార్క్‌ నగరంలో బ్రూక్లిన్‌ అపార్ట్‌మెంట్‌. దాని ఎదురుగానే వైకాఫ్‌ హైట్స్‌ అనే ఆస్పత్రి ఉంటుంది. ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఒక జంట ప్రతీ రోజూ కిటికీలోంచి ఆస్పత్రి వైపే చూస్తూ ఉంటారు. ఇప్పుడు దాని ఎదుట మృత దేహాలను తీసుకువెళ్లడానికి వచ్చే ఏసీ ట్రక్కులు బారులు తీరి కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం చూస్తుంటే మనసు కలిచి వేస్తోందని అలిక్స్‌ మోంటాలెనె అన్నారు. ఆమె రాయిటర్స్‌ వార్తా సంస్థతో స్కైప్‌లో మాట్లాడారు. ‘‘మా కిటికీ లోంచి బయటకి చూస్తే ఏం జరుగుతుందో కనిపిస్తూ ఉంటుంది.

వాతావరణం చాలా గందరగోళంగా ఉంది. అంటే ఆస్పత్రి లోపల ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. రోజుకు ఎన్ని మృతదేహాలు వస్తున్నాయో లెక్క పెట్టడం మానేశాం. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది’’అని చెప్పారు. కరోనా వైరస్‌ ధాటికి న్యూయార్క్‌ అల్లకల్లోలంగా మారింది. కేవలం న్యూయార్క్‌లోనే కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటితే, 6 వేలకి పైగా మరణాలు నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కోవిడ్‌–19తో జనం పిట్టల్లా రాలిపోతూ ఉండడంతో పెద్ద పెద్ద ఏసీ ట్రక్కుల్ని తాత్కాలిక మార్చురీల కింద మార్చేశారు. ఎవరైనా మరణిస్తే వాటిల్లో భద్రపరిచి, తమ వంతు వచ్చినప్పుడు ఖననం చేస్తున్నారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 4.50 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 16 వేలకు చేరింది.   
కోవిడ్‌–19 రోగులు కళ్ల ముందే మరణిస్తూ ఉండడంతో వైద్య సిబ్బంది కూడా హడలెత్తిపోతున్నారు. ఏ విపత్తు కూడా అమెరికాను ఈ స్థాయిలో ఇప్పటివరకు వణికించకపోవడంతో ఏం జరుగుతోందో, దీనిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయారు. ‘మా నగరంలో వైరస్‌ విశ్వరూపం చూపిస్తోంది. ప్రతీ ఒక్కరినీ కాపాడడమే ఇప్పుడు మా ముందున్న లక్ష్యం. వచ్చే రెండు వారాల్లో వైరస్‌ని అదుపులోకి తెస్తాం’ అని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో అన్నారు. ఈ వైరస్‌ కేవలం వృద్ధుల్ని, వేరే వ్యాధులతో బాధపడుతున్న వారినే కాదు, యువకుల్ని కూడా కాటేస్తోంది. ‘అప్పటివరకు ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. కోలుకుంటున్నారు కదా అనుకుంటాం. హఠాత్తుగా కళ్ల ముందే తుది శ్వాస విడుస్తున్నారు. యువతీ యువకులు కూడా దీనికి అతీతమేమీ కాదు’అని మౌంట్‌ సినాయ్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు డయానా టోరెస్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *