79 బంతుల్లో 205 పరుగులు చేసిన ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి సరి కొత్త చరిత్ర

టీ 20 క్రికెట్‌ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ నమోదైంది. 79 బంతుల్లో 205 పరుగులు చేసిన ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి సరి కొత్త చరిత్ర సృష్టించాడు. 20 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దేశ రాజధానిలో ఆదివారం జరిగిన ఓ క్లబ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ ఎలెవన్ జట్టు తరఫున బరిలోకి దిగిన సుబోధ్ భాటి.. ప్రత్యర్థి సింబా జట్టుపై ఈ ఘనత సాధించాడు. ఓపెనర్‌ వచ్చిన సుబోధ్ అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు,17 సిక్సర్లు ఉండడం గమనార్హం.

తొలి 100 పరుగులను ఈ రంజీ ఆటగాడు కేవలం 17 బంతుల్లో సాధించడం విశేషం. దీంతో ఢిల్లీ ఎలెవన్ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లకు 256 పరుగులు చేసింది. సుబోధ్ భాటితో పాటు సచిన్ భాటి 33 బంతుల్లో 25 పరుగులు చేయగా, కెప్టెన్ వికాస్ భాటి ఆరు పరుగులు చేశాడు. అంతకు ముందు టీ 20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన రికార్డు క్రిస్‌గేల్‌ పేరున ఉంది. యునివర్సల్‌ బాస్‌ 2013 ఐపిఎల్‌లో పూణే వారియర్స్‌ పైన 66 బంతుల్లో 175 సాధించాడు. తరువాత ట్రై-సిరీస్‌లో జింబాబ్వేపై ఆరోన్‌ ఫించ్ 76 బంతుల్లో 172 పరుగులు చేసి తర్వాత స్థానంలో ఉన్నాడు. ఇక సుబోధ్ భాటి కెరీర్‌ విషయానికొస్తే 24 లిస్ట్-ఎ, 39 టీ 20 మ్యాచ్‌ల్లో ఢిల్లీకు ప్రాతినిధ్యం వహించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *