40 శాతం బీసీ రిజర్వేషన్ల తర్వాతే స్థానిక ఎన్నికలు: కవిత..

స్థానిక సంస్థల ఎన్నికలను 40 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు ఖమ్మంలో ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల హామీని నెరవేర్చకుండా ఎన్నికలకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జులై 17న రాష్ట్రవ్యాప్త ‘రైల్ రోకో’కు పిలుపునిచ్చినట్లు ఆమె వెల్లడించారు.

 

ఉద్యమాలకు ఖిల్లా ఖమ్మం జిల్లా ప్రజలు, బీసీ సోదరులు ఈ రైల్ రోకోలో పెద్ద సంఖ్యలో పాల్గొని బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కవిత కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్‌రావుపై ఉందని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక సభలలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు.

 

ప్రభుత్వంపై విమర్శలు

 

కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని, బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. అలాగే, పోలవరం-బనకచర్ల నీటి సమస్యపై ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు నోరు మెదపాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *