ఈ నెల (జూలై) 11న అంతరిక్షంలోకి కాలు పెట్టబోతున్న తొలి తెలుగు అమ్మాయి శిరీష బండ్ల చరిత్ర సృష్టించనున్నారు. అంతరిక్షకంలోకి అడుగుపెట్టబోతున్న ఆరుగురు పరిశోధకుల బృందంలో శిరీష కూడా ఒకరు. అయితే టీమ్ మొత్తంలో ఆమె ఒక్కతే మహిళ కావడం గమనార్హం. విఎస్‌ఎస్ వర్జిన్ స్పేస్ మిషన్ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రిచర్డ్ బ్రాస్నన్ సారధ్యం వహిస్తున్న విషయం తెలిసిదే. ఈ సందర్భంగా శిరీష తాతయ్య డాక్టర్ రాగయ్య ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నా మనవరాలు శిరీష అంతరిక్షంలోకి వెళ్లడం నేనెంతో సంతోషిస్తున్నాను. తను చిన్నప్పటి నుంచే ఆకాశం పట్ల ఆకర్షితురాలైంది. తను చాలా ధైర్య వంతురాలు. ఏ సమయంలోనైనా సరే.. సరైన నిర్ణయాలు తీసుకోగలదు. తన బృందంతో కలిసి వెళుతున్న శిరీష.. అంతరిక్షంలోకి సురక్షితంగా వెళ్లి తిరిగి రావాలని నాతోపాటు..
మా బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కోరుకుంటున్నాము’ అని ఆయన అన్నారు. అలాగే ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న శిరీష.. భారతీయులందరూ గర్వించేలా చేస్తుంది అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.