అభిజిత్‌ ముఖర్జీ కాంగ్రెస్‌ను వీడి తృణమూల్‌ గూటికి చేరేందకు రంగం సిద్దమైంది

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ కాంగ్రెస్‌ను వీడి తృణమూల్‌ గూటికి చేరేందకు రంగం సిద్దమైంది. ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరేందకు కొంతకాలంగా ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే అభిజిత్.. తృణమూల్‌లో చేరాలని తుది నిర్ణయానికి వచ్చారు. సోమవారం సాయంత్రం ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. మరోవైపు ఓ ప్రముఖ వ్యక్తి సోమవారం సాయంత్రం తమ పార్టీలో చేరనున్నట్టు టీఎంసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ నేత ఎవరన్నది మాత్రం టీఎంసీ వెల్లడించలేదు. అయితే ఆ నేత అభిజిత్ ముఖర్జీనే అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే బెంగాల్ తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్‌కు.. అభిజిత్ పార్టీ వీడటం పెద్ద షాక్ అనే చెప్పాలి.

గత కొద్ది రోజులుగా అభిజిత్ తృణమూల్‌లో చేరతారనే వార్తలు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తృణమూల్‌లో చేరేందకు ఆయన మంతనాలు జరుపుతున్నారని మీడియా కథనాలు వెలువడ్డాయి. కొందరు తృణమూల్‌ నేతలను ఆయన కలిసిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే పార్టీ మార్పు వార్తలను అభిజిత్ ఖండించారు. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పారు. తాను తృణమూల్‌లో గానీ, మరే ఇతర పార్టీలో గానీ చేరడం లేదని వెల్లడించారు. అయినప్పటికీ అభిజిత్ పార్టీ మార్పుపై కథనాలు వెలువడుతూనే వచ్చాయి. ఇక, ఇటీవల ఫేక్ వ్యాక్సిన్ వివాదానికి సంబంధించి మమతా బెనర్జీకి మద్దతుగా అభిజిత్ ట్విట్టర్ వేదికగా తన వాయిస్ వినిపించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ సర్కార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో అభిజిత్ తృణమూల్‌ చేరతారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది.

ఇక, జంగిపూర్ లోక్‌సభ స్థానం నుంచి అభిజిత్ ముఖర్జీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు చూసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జట్టు కట్టడంపై అభిజిత్ ముఖర్జీ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే కాంగ్రెస్ ఓట్ల వాటా పెరిగి ఉండేదని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్న ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *