మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

,

కుమురం భీం జిల్లా సిర్పూర్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు కావేటి సమ్మయ్య (63) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య కావేటి సాయిలీల, ముగ్గురు కుమారులు ఉన్నారు. తొలుత కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమ్మయ్య 2007లో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాగజ్‌నగర్‌ పట్టణంలో సాగిన 300 రోజుల రిలే దీక్ష శిబిరాన్ని ముందుండి నడిపించారు.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో నిలిచి కాంగ్రెస్‌ అభ్యర్థి కోనేరు కోనప్పపై 7 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర సాధనలో భాగంగా 2010లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 2012లో అసెంబ్లీ భవనంపై ఎక్కి నల్ల జెండాతో నిరసన తెలిపారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావేటి సమ్మయ్య బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. కొన్ని కారణాల వల్ల 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమ్మయ్య మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.

కావేటి మృతిపై కేసీఆర్‌ సంతాపం 

 టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కావేటి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *