ఓపీని ఎక్కడా ఆపొద్దు..

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. కరోనా రోగులకు చికిత్స అందించే 8 ఆస్పత్రులు మినహా మిగిలిన అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంకొన్నాళ్లు లాక్‌డౌన్‌ కొనసాగిస్తే మంచిదనేది తమ అభిప్రాయమన్నారు. కేంద్రం కూడా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటోందని, అనంతరం ఓ తుది నిర్ణయానికి వస్తుందన్నారు. నెల రోజులుగా కరోనాపై నిరంతరం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ, వైద్య ఆరోగ్య యంత్రాంగాన్ని ఆయన ముందుండి నడిపిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, చికిత్స, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వంటి అంశాలపై మంత్రి ఈటల రాజేందర్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నందున సాధారణ ఆపరేషన్లు, ఓపీ సేవలు నిలిపేయాలని మొదట్లో చెప్పాం. ఎమర్జెన్సీ వైద్య సేవలు మాత్రమే అందజేయాలని ఆదేశాలు ఇచ్చాం. అయితే సాధారణ రోగులు ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటిలోనూ ఓపీ సేవలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేస్తాం. అయితే అదెలా ఉండాలన్నదానిపై మార్గదర్శకాలు ఇస్తాం. ప్రస్తుతం కరోనా చికిత్సల కోసం కేటాయించిన 8 ఆస్పత్రుల్లో మాత్రం సాధారణ ఓపీ సేవలు అందించబోం. 

 
గచ్చిబౌలి కాంప్లెక్స్‌లో ప్రస్తుతం కరోనా చికిత్స కోసం 1,500 పడకలతో ఆస్పత్రి ఏర్పాటు చేశాం. అందుకు అవసరమైన సిబ్బందిని కూడా తీసుకుంటున్నాం. దాదాపు రెండు, మూడు వేల మంది సిబ్బందిని భర్తీ చేస్తాం. కరోనా నుంచి రాష్ట్రం విముక్తి అయ్యాక గచ్చిబౌలి ఆస్పత్రిని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తాం. నిమ్స్‌ను తలదన్నేలా తీర్చిదిద్దుతాం. పేదలందరికీ సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తాం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *