అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై, యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీకి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.
అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. “అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసింది. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు పలకడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లో ప్రజలు యోగాను ఆచరించడం అనేది ఒక సాధారణ విషయం కాదు” అని ప్రధాని పేర్కొన్నారు.
యోగా అనేది మానవత్వాన్ని పెంపొందించే ఒక సామూహిక ప్రక్రియ అని ఆయన అభివర్ణించారు. “గత పదేళ్ల కాలంలో కోట్లాది మంది ప్రజల జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. ఈ రోజు గ్రామగ్రామాల్లో యువతరం యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. యోగా చేయడానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదు. అలాగే యోగాకు ఎలాంటి హద్దులు లేవు” అని ప్రధాని మోదీ అన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని ఆయన సూచించారు.