బనకచర్లపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు..! సీఎం చంద్రబాబు స్పందన..!

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం తెలిసిందే. గోదావరి నదీ జలాలను బనకచర్ల ప్రాజెక్టుకు అనుసంధానించడం ద్వారా తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అయితే, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. వాస్తవాలను ఆయన మీడియాకు వివరించారు. బనకచర్ల వద్ద పోలవరం మినహా మరే ఇతర ప్రాజెక్టుకు అనుమతులు లేవని ఆయన తేల్చిచెప్పారు.

 

గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. “బనకచర్ల ప్రాజెక్ట్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. పోలవరం మినహా అక్కడ మరే ప్రాజెక్టుకు అనుమతి లేదు” అని ఆయన అన్నారు. గోదావరి జలాలను వేరే బేసిన్‌కు తరలిస్తున్నామని, గోదావరి జలాలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు. “రెండు రాష్ట్రాల్లో ఉన్నది తెలుగువాళ్లే. నేను తెలంగాణ ప్రజలతో ఎప్పుడూ ఘర్షణ పడలేదు. అనవసర గొడవలతో ప్రజలను మభ్యపెట్టడం సరికాదు” అని చంద్రబాబు పేర్కొన్నారు. తాను హైదరాబాద్ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ కోసమే అభివృద్ధి చేశానని, ఇప్పుడు హైదరాబాద్ కావాలని తాను ఎలా అడుగుతానని ప్రశ్నించారు.

 

అంతేకాకుండా, అభివృద్ధి విషయంలో తన వైఖరిని చంద్రబాబు స్పష్టం చేశారు. “మీరు చేపట్టే ప్రాజెక్టులన్నీ పూర్తిచేయండి, పోరాటాలు తర్వాత చూసుకోవచ్చు. మేం హామీ ఇచ్చింది డబుల్ ఇంజన్ సర్కార్. దాని అర్థం ఏమిటో తెలుసుకోండి. అందరూ కలిసి రాష్ట్రాలను పోటీపడి అభివృద్ధి చేయాలన్నదే నా ఆకాంక్ష. తెలుగు జాతిని ప్రథమ స్థానంలో నిలపడం మనందరి బాధ్యత. అందుకోసం మనమంతా కలిసి పనిచేద్దాం. నేను ఎవరితోనూ గొడవలకు దిగను, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కచ్చితంగా పోరాడతాను. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదు. కేవలం వరద జలాలను మాత్రమే వినియోగిస్తామని స్పష్టంగా చెప్పాం” అని ముఖ్యమంత్రి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *