కోర్టులో స్వయంగా చెవిరెడ్డి వాదనలు .. జైలులో ప్రత్యేక వసతులకు వినతి..

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు నిన్న ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన విషయం విదితమే. ఈ క్రమంలో చెవిరెడ్డి కోర్టులో తన వాదనలను స్వయంగా వినిపించారు.

 

సిట్ అధికారులు ఆరోపిస్తున్నట్లు బాలాజీ తన పీఏ కాదని, అతను ప్రభుత్వ ఉద్యోగి అని చెవిరెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న వ్యక్తులు అధికారిక వాహనాలను వినియోగించుకునే అవకాశం ఉండదని, ఈసీ స్వయంగా పర్యవేక్షిస్తుందని అన్నారు. తనకు ఎగుమతుల వ్యాపార పనులు ఉండడం వల్ల తరచూ కొలంబో వెళ్తుంటానని, ఆ క్రమంలోనే మంగళవారం వెళ్లబోగా బెంగళూరు విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు నిలువరించారని, తనపై ఎల్ఓసీ ఉన్నట్లు చెప్పారన్నారు.

 

గన్‌మన్ గిరిని ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా పోలీసులు స్టేట్‌మెంట్ ఇప్పించుకున్నారని, మరో గన్‌మన్ మదన్ రెడ్డి అనుకూలంగా చెప్పనందుకు సిట్ అధికారులు దాడి చేశారని, దీంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెవిరెడ్డి వాదించారు.

 

కాగా, రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేయగా, తనకు వెన్నునొప్పి ఉందని, జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయాధికారిని చెవిరెడ్డి కోరారు. ఆయన వినతిని పరిగణలోకి తీసుకున్న న్యాయాధికారి మంచం, దిండు, దుప్పటి, దోమతెరకు అనుమతి ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *