క్యాస్టింగ్ కౌచ్… ఎన్నో ఏళ్లగా కథానాయికలను పట్టి పీడిస్తున్న సమస్య. సినిమాల్లో అవకాశం కోసం చిత్ర రంగంలో అడుగుపెట్టే ప్రతి అమ్మాయి ఈ సమస్యను ఎదుర్కొంటుంది. సినిమాల్లో అవకాశాల కోసం చాలామంది నాయికలు గొంతెత్తి మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఈ సమస్యను ఎదుర్కొంటున్న ప్రతి నాయిక ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు. గతంలో మీటూ పేరుతో పెద్ద ఉద్యమమే జరిగింది. ఎంతోమంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా ‘పచ్చీస్’, ‘సైకిల్’ చిత్రాల్లో నటించిన శ్వేతా వర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాట్లాడారు. ”నేనొక సినిమా ఆఫీస్‌కి వెళ్లాను. 20 కోట్లు విలువ గల విల్లా ఉన్న నిర్మాత అతను. ఆ నిర్మాతకు కమిట్‌మెంట్ ఇస్తారా అని దర్శకుడు నేరుగా అడిగాడు.
కానీ ఆ దర్శకుడికి హీరోయిన్‌ల పట్ల అలాంటి ఆలోచన లేదు. కాకపోతే ఆ నిర్మాత కోసం అతను డైరెక్ట్‌గా అడగడం చూసి ఆశ్చర్యపోయా. అలాంటి సిట్యూవేషన్ ఎదురుకావడం అదే మొదటిసారి. అయితే దర్శకులు ఎవరైనా తమ సినిమా అవకాశం కోల్పోవడం ఇష్టం లేకే అలా చేస్తారని అర్థమైంది.
అయినా అలాంటి దర్శకులకు మద్దతుగా నిలవకూడదనిపించింది. నేను నా టాలెంట్‌ను నమ్ముకుని వచ్చాను. అడ్డదారుల్లో వెళ్లాలనుకోలేదు. ఇలాంటి పనులకు మధ్యవర్తిత్వం వహించేది మేనేజర్లు, క్యాస్టింగ్ డైరెక్టర్లే.
దురదృష్టకర విషయం ఏంటంటే చాలామంది అమాయక మహిళలు అవకాశాల కోసం లొంగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవర్ని నిందించాలో.. పోరాటం ఎక్కడ మొదలుపెట్టాలో కూడా అర్ధం కావట్లేదు. అయితే నా కోసం నేను మాట్లాడుకోగలను. పోరాటం చేయగలను. ఇతరుల అభిప్రాయాలను నేను మార్చలేను” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు శ్వేతా వర్మ.