తమిళనాడు : కరోనా కట్టడికి చాల మంది వారి వారి రాష్ట్ర ప్రభుత్వాలకి , కేంద్ర ప్రభుత్వానికి వారికి తోచినంత విరాళాలని ఇస్తున్నారు . కానీ ఈ విషయంలో కూడా కొన్ని అనూహ్య సంఘటనల వాళ్ళ ఒకరి ప్రాణాలకి అపాయం ఏర్పడింది . కరోనా నివారణ కోసం ఇద్దరు హీరోలు ఇచ్చిన విరాళంపై అభిమానుల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడి ప్రాణం తీసింది. తమ హీరో అంటే, తమ హీరో గొప్ప అంటూ పోట్లాడుకున్న అభిమానుల్లో ఒకరు హత్యకు గురయ్యాడు. లాక్ డౌన్ కష్టాలతో అలమటిస్తున్న పేదల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం విరాళాల్ని సేకరించే పనిలో పడింది. సీఎం పళని స్వామి పిలుపుతో స్పందించే వాళ్లు ఎక్కువే. సినీ రంగ ప్రముఖులు సైతం కదిలారు. అయితే, అభిమానులు తమ హీరో సినిమా అంటే, తమ హీరో సినిమా సూపర్ అంటూ జబ్బలు చరచుకోవడం, ఇంకా చెప్పాలంటే, తన్నుకోవడం వంటి పరిణామాలు ఇన్నాళ్లు చూశాం. విల్లుపురం జిల్లా మరక్కానంకు చెందిన యువరాజ్ హీరో విజయ్ వీరాభిమాని. అతడి మిత్రుడు దినేష్ బాబు రజనీకాంత్ వీరాభిమాని. మంచి మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరు హీరోల విషయంలో శత్రువులు అన్నట్లుగా వ్యవహరించేవారు. గురువారం ఇద్దరి మధ్య కరోనా విరాళం గొడవ ప్రారంభమైంది. తమ హీరో అంటే, తమ హీరో ఎక్కువ మొత్తం ఇచ్చాడని, సేవలు చేయిస్తున్నాడంటూ వాదులాటకు దిగారు. ఇంతలో ఆగ్రహంతో రెచ్చి పోయిన దినేష్ బాబు యువరాజ్‌ను గట్టిగా నెట్టేయడంతో కింద పడ్డాడు. దీంతో తలకు బలంగా దెబ్బతగలడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన దినేష్ బాబు అక్కడి నుంచి ఉడాయించాడు. సమాచారం అందుకున్న మరక్కానం పోలీసులు కేసు నమోదు చేశారు. యువరాజ్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విల్లుపురం ఆస్పత్రికి తరలించారు. కాగా దినేష్‌కుమార్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.