మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఫార్ములా ఇ-కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూన్ 16, సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. మే 26నే ఎంక్వైరీకి రావాలని గతంలో నోటీసులు ఇవ్వగా.. అప్పుడు విదేశీ పర్యటన ఉందని.. వచ్చాక వస్తానని కేటీఆర్ అన్నారు. దాంతో ఈసారి జూన్ 16న రావాలంటూ మరోసారి నోటీసులు ఇష్యూ చేసింది ఏసీబీ.
ఇ-కార్ రేసు వ్యవహారంలలో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం.. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం.. వంటి వ్యవహారాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకుముందే అనుమతి ఇచ్చింది.
కేటీఆర్ దేనికైనా రెడీనా?
2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహించారు. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. అందులో రూ.44 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. వీటన్నింటిపైనా ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. కేటీఆర్‌ను ప్రశ్నించేందుక ఏసీబీ నోటీసులు ఇవ్వగా.. ఆయన హాజరు అవుతారా? లేదా? అనే ఆసక్తి పెరిగింది. ఎలాంటి కేసులైనా పెట్టుకోండి.. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటా.. భయపడేదేలే అంటూ ఇటీవల తరుచూ కామెంట్స్ చేస్తున్నారు కేటీఆర్. ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టుగానే తాను విచారణకు వస్తానంటూ ట్వీట్ చేశారు. దమ్ముంటే లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ కూడా విసిరారు.
కల్వకుంట్ల కుటుంబంలో కల్లోలం
ఇటీవలే కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. 50 నిమిషాల పాటు సాగింది ఆ ఎంక్వైరీ. కేసీఆర్ తర్వాత ఇప్పుడు కేటీఆర్ ఏసీబీ విచారణకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా తండ్రీకొడుకులు ఇద్దరూ వరుసగా విచారణలకు హాజరవడం బీఆర్ఎస్ పరపతిని దెబ్బ తీస్తోందని అంటున్నారు. ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. వచ్చాక జాగృతి పేరుతో దాదాపు వేరు కుంపటి పెట్టుకున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలంటూ డైరెక్ట్‌గా అన్నపైనే అటాక్ చేశారు. ఇటీవల ఫాంహౌజ్‌కు వచ్చిన కూతురు ముఖం కూడా చూడకుండా కేసీఆర్ తన ఆగ్రహాన్ని ఓపెన్‌గానే ప్రకటించారని అంటున్నారు. తండ్రీ, కొడుకు, కూతురు.. ఇలా కల్వకుంట్ల కుటుంబంలో ముగ్గురూ కష్టాల్లో ఉండటంతో పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తుందని విశ్లేషిస్తున్నారు.
మండే అటెన్షన్
అటు కాళేశ్వరం కేసు.. ఇటు ఫార్ములా ఈ కారు రేసు.. రెండింటిలోనూ పక్కా ఆధారాలు ఉన్నాయంటోంది ప్రభుత్వం. సెక్షన్లు గట్రా పకడ్బందీగా పెట్టారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. తండ్రీకొడుకులు ఇద్దరూ జైలుకు వెళ్లడం పక్కా అంటూ సవాల్ చేస్తున్నారు. అయితే, భయపడేదేలే అంటూ కేటీఆర్ ఇప్పటికే కాలర్ ఎగరేశారు. చూస్కుందాం.. తేల్చుకుందాం.. అంటూ ఎదురు సవాళ్లు చేస్తున్నారు. కట్ చేస్తే.. లేటెస్ట్గా ఏసీబీ నోటీసులు ఇవ్వడం.. జూన్ 16న రమ్మని పిలవడంతో.. తెలంగాణ పాలిటిక్స్‌లో సోమవారం టెన్షన్ మొదలైంది. ఆ రోజున ఏం జరగనుందో…?