అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్..

రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో, అసభ్యకర వ్యాఖ్యల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కృష్ణంరాజును భీమిలి గోస్తనీనది సమీపంలో సెల్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను విచారణ నిమిత్తం మంగళగిరికి తరలిస్తున్నట్లు సమాచారం.

 

వైసీపీ అనుబంధ సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా, అందులో పాల్గొన్న కృష్ణంరాజు “రాజధాని అమరావతి వేశ్యల రాజధాని” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రసారమైన వెంటనే రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులతో పాటు సాక్షి యాజమాన్యం కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల ఆందోళనలు జరిగాయి.

 

ఈ వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలు పోలీస్ స్టేషన్లలో కూడా వీరిపై కేసులు నమోదయ్యాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఈ విషయాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు.

 

ఇదే కేసులో, సాక్షి టీవీ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా కృష్ణంరాజు అరెస్టుతో ఈ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *