కొత్త మంత్రుల శాఖలు ఫిక్స్..! తేల్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..

కేసీఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్‌లోకి వెళ్తుందన్న ప్రచారానికి చెక్ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం ప్రధాన శత్రువుగా వర్ణించారు. తాను ఉన్నంత వరకు కేసీఆర్‌ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

 

పార్టీలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కవిత లేఖ రాశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి అంగీకరించేది లేదని అందులో ప్రస్తావించారు. కారు పార్టీలో అంతర్గత కలహాలు మొదలైనట్లు జోరుగా ప్రచారం సాగింది. ఆ లేఖ బయటపెట్టిన వారిపై చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు.

 

ఈ క్రమంలో కాంగ్రెస్ వైపు కవిత వెళ్తారంటూ బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. టీవీ డిబేట్లలో నేతలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు సీఎం రేవంత్‌రెడ్డి. తాను ఉన్నంతవరకు కేసీఆర్ ఫ్యామిలీకి ఛాన్స్ లేదని చెప్పకనే చెప్పారు.

 

మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై హైకమాండ్‌తో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. హైదరాబాద్‌ వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామన్నారు. తన దగ్గరున్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయిస్తానన్నారు. సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పులు లేవని చెప్పకనే చెప్పారు. తన దగ్గరున్న వాటిలో కొన్నింటిని కొత్తగా వచ్చిన మంత్రులకు ఇవ్వనున్నట్లు తెలిపారు.

 

సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో పాటు కీలకమైన 11 శాఖలు ఉన్నాయి. కొత్త మంత్రులకు ఆయా శాఖలను ఇవ్వనున్నారు. దీనిపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. గురువారం నాటికి శాఖల కేటాయింపు‌పై అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి.

 

కర్ణాటక కులగణనపై మాత్రమే అధిష్ఠానం వద్ద చర్చలు జరిగాయన్నారు. తెలంగాణలో సక్సెస్ అయిన కులగణన వివరాలు పంచుకోవడానికే ఢిల్లీ వచ్చానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై త్వరలో మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ బయట పెడతానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *