ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌ చిక్కాడు..! భారీగా బంగారం, డైమండ్స్, కోట్లలో ఆస్తులు..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌ చిక్కాడు. ఆయనను ఏసీబీ అరెస్టు చేసింది. నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం చేపట్టిన సోదాల్లో కేవలం రూ. 200 కోట్లకు సంబంధించి ఆస్తులను గుర్తించారు. ఆయన్ని కస్టడీకి తీసుకుని విచారిస్తే ఆస్తులు ఇంకా బయటపడవచ్చని భావిస్తున్నారు.

 

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇంట్లో బుధవారం ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆయనతోపాటు బంధువులకు సంబంధించి 13 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ సోదాలు అధికారులకు కళ్లు బైర్లు కమ్మేవాస్తవాలు బయటపడ్డాయి. భారీగా స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మార్కెట్లో వాటి విలువ 200 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 

ఇక బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు, కార్లు, విల్లాలు భారీగా బయటపడ్డాయి. తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేటలో ప్లాట్‌, కరీంనగర్‌లో మూడు ఓపెన్‌ ప్లాట్లు ఉన్నాయి. అలాగే అమీర్‌పేటలో కమర్షియల్ భవనం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో మూడు ఇండిపెండెంట్‌ ఇళ్లు ఉన్నాయి. అతడికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు అధికారులు.

 

హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో 19 ఓపెన్‌ ప్లాట్‌లు ఉన్నట్టు సోదాల్లో బయటపడింది. బ్యాంకులో భారీగా నగదు నిల్వలను గుర్తించారు.‌ తన పదవి అడ్డం పెట్టుకుని శ్రీధర్ భారీగా భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు తేలింది. మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి ఉందని అంటున్నారు ఏసీబీ అధికారులు.

 

ఎస్‌ఆర్‌ఎస్పీ డివిజన్‌-8లో ఈఈగా పని చేస్తున్నారు శ్రీధర్. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను ఆయన దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఆయన ప్రస్తుతం ఇరిగేషన్‌ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. లభించిన ఆధారాలతో శ్రీధర్‌ని కస్టడీకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు అధికారులు. ఆయనకు సంబంధించి లాకర్లలో ఇంకెన్ని ఆస్తులు బయటకు వస్తాయో చూడాలి. ఆయనకు బినామీలుగా ఉండేవారిని గుర్తించే అవకాశంఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *