కట్టుకున్న భార్య క్యాన్సర్‌తో విలవిలలాడుతుంటే తట్టుకోలేకపోయాడు. భార్యను రక్షించుకోవాలన్న అతని తపన ముందు దూరం, వయోభారం ఏమాత్రం అడ్డురాలేదు. 65 ఏళ్ల వయసులో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి భార్యను సైకిల్‌పై తీసుకెళ్లాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన అరివలగన్ (65) రైతు. ఇతని భార్య మంజుల (60) క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఆమెకు జిప్మర్‌లో చికిత్స అందిస్తున్నారు. తరచూ ఆమెకు కీమో థెరపీ అందించాల్సి ఉంది. లాక్ డౌన్ అమలులో ఉండటంతో బస్సులు లేవు. ప్రైవేటు అంబులెన్సుకు చెల్లించుకునే స్తోమత లేదు. దీంతో మంగళవారం వేకువ జామున ఇంటి నుంచి సైకిల్‌పై భార్యను ఎక్కించుకుని పుదుచ్చేరిలోని జిప్మర్‌కు బయలుదేరాడు. ఒక పగలు, ఒక రాత్రి సైకిల్ మీద పయనం సాగించి బుధవారం ఉదయానికి పుదుచ్చేరికి చేరుకున్నాడు.
వైద్య నివేదికలు దగ్గర ఉంచుకోవడంతో దారిలో ఎక్కడా పోలీసులు ఇబ్బందులు పెట్టలేదు. జిప్మర్‌లోకి సైకిల్‌పై తన భార్యతో వచ్చిన అరివలగన్‌ను చూసిన వాళ్లంతా నివ్వెరపోయారు. జిప్మర్ వైద్యులు మంజులకు వైద్య పరీక్షలు జరిపి, కీమో థెరపీ అందించారు. అరివలగన్‌కు భార్యపై ఉన్న ప్రేమను చూసి చలించిన జిప్మర్ వైద్యులు గురువారం సాయంత్రం అంబులెన్స్‌లో ఆ జంటను కుంభకోణంకు పంపించారు.