భారత్‌కు విమాన సర్వీసులు నడపడంపై యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా కీలక ప్రకటన చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇండియాకు అన్ని ప్యాసెంజర్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక గత 14 రోజుల్లో భారత్‌కు వెళ్లిన వారు ఇతర ఏ దేశం మీదుగానైనా తిరిగి యూఏఈకి వచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కాగా, యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యాధికారులు, సవరించిన కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక అనుమతి ఉన్నవారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది.
ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాజాగా భారత్ సహా 14 దేశాలకు తమ దేశం నుంచి ప్రజలు వెళ్లకుండా యూఏఈ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ దేశాల జాబితాలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, కాంగో, ఉగాండా, సియెరా లియోన్, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా ఉన్నాయి. జూలై 21 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు జాతీయ అత్యవసర, సంక్షోభ, విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది.