రెండు రోజుల విరామం తర్వాత ఇంధన ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు పెరగడంతో రూ.100 దాటింది. అయితే డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.13, డీజిల్ ధర రూ.93.72 పలుకుతోంది. ఇంధనం ధరల పెంపుపై స్పందించిన లారీ యజమానుల సంఘం లారీ అద్దె పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సంఘ నిర్వాహకులతో సమావేశమై చర్చించాలని నిర్ణయించింది. డీజిల్ ధర పెంపు, డ్రైవర్లు, క్లీనర్ల వేతనం, టోల్ ఫీజు, విడిభాగాల ధరల పెంపు తదితర కకారణాలతో లారీ అద్దె పెంచితే నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా నగరంలో పెట్రోల్ ధర వంద రూపాయలు దాటిన నేపథ్యంలో పలువురు నెటిజన్లు కేంద్రప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్రమోదీపైన సెటైర్లు వేస్తున్నారు. ‘గ్రేట్ బ్యాట్స్‌మెన్.. పెట్రోల్ చేత కూడా సెంచరీ కొట్టించేశారు..’ వంటి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలు హల్‌చల్ చేస్తున్నాయి.