ప్రతి అంశమూ ఇప్పుడు రాజకీయమే.. కమల్ కన్నడ వ్యాఖ్యలపై రానా.

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయన నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా కర్ణాటకలో నిషేధానికి గురైంది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్నప్పటికీ కర్ణాటకలో మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. ఈ పరిణామాలపై టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి స్పందించాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రానా నాయుడు 2’ వెబ్‌సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ వివాదంపై రానా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

 

“సోషల్ మీడియా అనేది అభిప్రాయాలు వ్యక్తపరిచే వేదికగా మారిపోయింది. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి చిన్న విషయం కూడా రాజకీయ రంగు పులుముకుంటోంది, వివాదాస్పదంగా మారుతోంది” అని రానా పేర్కొన్నాడు. ‘తమిళం నుంచే కన్నడ పుట్టింది’ అన్న కమల్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో నిషేధించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించింది.

 

న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకుని అసహనం వ్యక్తం చేసినప్పటికీ కమల్ మాత్రం కేఎఫ్‌సీసీకి రాసిన లేఖలో క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం. అంతేకాకుండా, తన సినిమాను కర్ణాటకలో విడుదల చేయబోనని కమల్ హాసన్ కోర్టుకు తెలియజేశాడు. దీంతో, ‘థగ్ లైఫ్’ సినిమా నేడు కర్ణాటక మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

ఈ అంశంపై బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ కూడా స్పందించాడు. “ప్రస్తుతం కన్నడ-తమిళ భాషలపై ఎలాంటి చర్చ నడుస్తోందో, నేను ముంబయి వచ్చిన కొత్తలో మరాఠీ-బిహారీ భాషలపై కూడా ఇలాంటి చర్చే జరిగింది. కొందరు కేవలం అటెన్షన్ కోసమే ఇలాంటి వివాదాలు సృష్టిస్తుంటారు” అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *