జనాభా నియంత్రణ పద్ధతికి మద్దతు పలుకుతూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించబోయే మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారికి ప్రభుత్వం ఒక నిబంధన విధించింది. ఇద్దరికి మించి పిల్లలున్నవారు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లేదని తేల్చి చెప్పింది. ఈ ఏడాది జరగబోయే పంచాయతీ ఎన్నికల నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సమ్రాట్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం జనాభా నియంత్రణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం… ప్రజలలో జనాభా నియంత్రణపై మరింత అవగాహన కల్పిస్తుందన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు వరకూ ఉన్నవారికే పోటీ చేసేందుకు అర్హత కల్పించాలని నిర్ణయించామన్నారు.