హైదరాబాద్‌లోని రాజ్భవన్‌లో మిస్ వరల్డ్ టీంకి తేనీటి విందు ఇచ్చారు గవర్నర్ జిష్ణుదేవ్. మిస్ వరల్డ్ విజేతలకు అభినందించారు. మిస్వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్శ్రీతోపాటు రన్నరప్స్ ఆరేలి జాచిమ్, మయా క్లైడా, హాసెట్ డెరెజే కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. మిస్ వరల్డ్ ఓపల్ సుచాత శ్రీ,, ఇతర కాంటినెంటల్ విజేతలకు గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. గిరిజనులు తయారుచేసిన అటవీ ఆకులతో రూపొందించిన స్వాగత వేదిక వద్ద ఫోటోషూట్లో పాల్గొన్నారు మిస్ వరల్డ్ విజేతలు. వారంతా మిస్‌వరల్డ్ జర్నీని గవర్నర్‌తో పంచుకునున్నారు. తేనీటి విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే.. 72వ మిస్ వరల్డ్ విజేతగా థాయ్ సుందరి సుచాత ఎంపిక కావడంతో.. ప్రపంచ మంతా థాయ్ ల్యాండ్ అందాల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటి వరకూ ఒక్కసారిగా కూడా ఈ కిరీటం థాయ్ గెలవక పోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రపంచ ప్రజలు.
అందాల పోటీలు అంటే వివిధ దేశాల నుంచి కంటెస్టెంట్లు రావడం, పోటీల్లో పాల్గొనడం, వారి పనేదో వారు చూసుకుని విజేతను ప్రకటించేసి వెళ్లడం ఇదే జరుగుతోంది. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం.. ఈ మెగా బ్యూటీ ఈవెంట్ ను తెలంగాణకు బూస్టప్ వచ్చేలా చేయడంలో సరికొత్తగా ఆలోచించారు. వందకు పైగా దేశాల నుంచి సుందరీమణులు, మీడియా, వారి ప్రతినిధి బృందాలను తెలంగాణలోని ఫేమస్ టూరిస్ట్ ప్రాంతాలకు పంపించారు. అక్కడ కార్యక్రమాలు చాలా పకడ్బందీగా నిర్వహించారు. ప్రపంచదేశాల్లో మంచి కవరేజ్ వచ్చేలా చూసుకున్నారు. శెభాష్ అనిపించుకున్నారు.
అందం అంటే బాహ్య స్వరూపం కాదు.. అంతఃసౌందర్యం అని నిరూపించే కంటెస్టే.. మిస్ వరల్డ్ ఈవెంట్. అవును ఏదో వచ్చాం.. పోటీల్లో పాల్గొన్నాం.. వెళ్లిపోయాం అన్నట్లు కాకుండా చాలా పకడ్బందీగా.. కంటెస్టెంట్లు గుండెల నిండా సంతోషాన్ని నింపుకొని వెళ్లేలా ఈసారి మిస్ వరల్డ్ పోటీలను డిజైన్ చేయించింది రాష్ట్ర ప్రభుత్వం.
భారత్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఇది మూడోసారి. తొలిసారి 1996లో బెంగళూరులో నిర్వహించారు. వీటి నిర్వహణలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు చెందిన ఏబీసీఎల్ కంపెనీ నాడు కీలక పాత్ర పోషించింది. రెండోసారి 2024లో ముంబయి, ఢిల్లీలో నిర్వహించారు. మార్చి 9న ముంబైలో జరిగిన ఫైనల్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చింది. బ్యూటీ విత్ పర్పస్ కు, తెలంగాణ జరూర్ ఆనా క్యాప్షన్ జత చేసింది. విజయవంతమైంది. విజేతకు మిస్ వరల్డ్ కిరీటంతో పాటుగా కళ్లు చెదిరే ప్రైజ్ మనీ కూడా లభిస్తుంది. విజేతకు 1 మిలియన్ డాలర్ అంటే మన కరెన్సీలో 8.5 కోట్ల రూపాయలు దక్కుతాయి. ఈ ప్రైజ్ మనీ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, ప్రధాన స్పాన్సర్ల ద్వారా లభిస్తుంది.