జూన్ 4న వెన్నుపోటు దినం..విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సజ్జల..

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధినేత చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతోంది. 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా, జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చలేదని వైకాపా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీని ‘వెన్నుపోటు దినం’గా నిర్వహించాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

 

వైకాపా రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్య నేతలతో బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ఈ ఏడాది పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ప్రజల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సజ్జల కోరారు.

 

ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్లకు, నియోజకవర్గ స్థాయి అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని సజ్జల సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వైకాపా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *