రాష్ట్రంలో ఆరాచక పాలన.. జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకు పోలేదని చెప్పారు. ఈ రోజు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 

రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఫైరయ్యారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

వైసీపీ హయాంలో కరోనా మహమ్మారి ముంచుకొచ్చిందని అన్నారు. కొవిడ్ సమయంలో ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదని చెప్పారు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదని అన్నారు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశామని అన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చామని అన్నారు.

 

సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టామని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా పని చేశామని ఆయన వివరించారు. రాష్ట్రంలో 99శాతం హామీలను అమలు చేశామని పేర్కొన్నారు. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశామని.. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశామని ఆయన గుర్తు చేశారు.

 

ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదని.. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోందని మాజీ జగన్ చెప్పారు. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉందని అన్నారు. వైసీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి పలానా వైఎస్సార్‌సీపీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని నిలదీశారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని.. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయని.. కూటమి నేతలు దీనికి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *