తెలుగు మీడియాన్ని తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టాలన్న నిర్ణయం.. ప్రతి తెలుగువాడి గుండెలో ముల్లులా గుచ్చుకుంటోందంటూ జగన్‌కు లేఖ రాశారు ఎంపీ రఘురామ. మాతృభాషతో మనుగడ లేదు, పరాయి భాష నేర్చుకుంటేనే బతుకు ఉంటుందని పాలకులైన మనమే చెబితే ఎలా అంటూ ప్రశ్నించారు. నిర్బంధ ఉచిత విద్యా చట్టం తెచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పిల్లలకు మాతృభాషలోనే విద్యాభోదన జరగాలని చట్టంలో పేర్కొన్నారని గుర్తు చేశారు. వైఎస్ తీసుకొచ్చిన చట్టం గురించి తెలిస్తే.. ఇలా ఇంగ్లీష్ మీడియంపై పాకులాడరని లేఖలో ప్రస్తావించారు.
ఇంగ్లీష్ మీడియం జీవోను హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లారని, అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలిన విషయాన్ని గమనించాలన్నారు ఎంపీ రఘురామ. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనే అంశం విద్యా హక్కు చట్టంలోనే లేదనే జగన్ వాదన సరైంది కాదన్నారు. రాజ్యంగంలోని 350-ఏ ఆర్టికల్‌లో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని చాలా స్పష్టంగా ఉందన్నారు రఘురామ. చాలా రాష్ట్రాల్లో తమ మాతృభాషను రక్షించుకోడానికి పోరాటాలు చేస్తుంటే.. ఏపీలో మాత్రం మాతృభాషను చంపేసేందుకు ఇంగ్లీష్ మీడియాన్ని నెత్తికెత్తుకుంటున్నాం అని అన్నారు.
ఉన్నట్టుండి ఇంగ్లీష్ మీడియం పెడితే.. ఆంగ్లంలో బోధించే వారు ఎవరు అని లేఖలో ప్రశ్నించారు ఎంపీ రఘురామ. ఇంగ్లీష్ మీడియంలో చెప్పగలిగేంత మంది ఉపాధ్యాయులు ఉన్నారో లేదో చూశారా అని ప్రశ్నించారు. ఇంతకాలం తెలుగులో పాఠాలు చెప్పిన టీచర్లకు.. ఇంగ్లీష్ మీడియంలో చెప్పేందుకు శిక్షణ ఇప్పించారా అని నిలదీశారు. అయినా.. జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని స్పష్టంగా ఉన్నందున ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న మీ సంకల్పం నెరవేరే అవకాశం కనిపించడం లేదంటూ కామెంట్ చేశారు రఘురామ.