పీఎన్‌బీ స్కామ్‌ ప్రధాన నిందితుడు మెహుల్‌ చోక్సి 

 పీఎన్‌బీ స్కామ్‌ ప్రధాన నిందితుడు మెహుల్‌ చోక్సి ని ఆంటిగ్వా నుంచి బలవంతంగా అపహరించడం వెనుక తమ ప్రభుత్వ ప్రమేయం ఉందన్న ఆరోపణలను డొమినికా ప్రధాని రూజ్‌వెల్ట్‌ కొట్టి పారేశారు. ఆ దేశంలో ప్రసారమయ్యే ఒక వీక్లీ షోలో పాల్గొన్న రూజ్‌వెల్ట్, ఇవన్నీ అర్ధం లేని ఆరోపణలని వ్యాఖ్యానించారు. కోర్టు తన పని తాను చేస్తుందని, అలాగే తమ రాజ్యాంగం ప్రకారం చోక్సి ఉన్న హక్కులకు రక్షణ లభిస్తుందని తెలిపారు.

భారత్‌ నుంచి పారిపోయిన చోక్సి 2018 నుంచి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. ఆదేశం నుంచి చోక్సిని భారత్‌కు రప్పించడంలో కాలయాపన జరుగుతున్నందున అతన్ని భారత ప్రభుత్వంతో కలిసి రూజ్‌వెల్ట్‌ ప్రభుత్వం అపహరించిందని డొమినికాలో ఆరోపణలున్నట్లు ఆదేశ మీడియా తెలిపింది. వీటిని రూజ్‌వెల్ట్‌ తోసిపుచ్చారు. అలాంటి పనుల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. అయితే ఒకదేశంలో ఒక నేరం చేసి మరో దేశంలో హాయిగా తిరగనివ్వడం మంచిదా?

లేక ఆ దేశం నుంచి హంతకుడిని తీసుకువచ్చి శిక్షించడం మంచిదా? ఆలోచించాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తులను వారి అంతస్తులను బట్టి తమ దేశం ప్రవర్తించే తీరులో మార్పుఉండదని, అందరినీ చట్టం ముందు సమానంగా చూస్తామని తెలిపారు. అయితే చోక్సి లాయర్లు మాత్రం ఇది ప్రభుత్వాల పనేనని ఆరోపిస్తున్నారు. డొమినికా లేదా ఆంటిగ్వా ప్రభుత్వాలకు ఇందులో ప్రమేయం ఉందని తేలితే అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై స్కాట్‌లాండ్‌ యార్డ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *