కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ పలువురు క్రికెటర్లు దానిని సరదాగా ఆస్వాదిస్తున్నారు. లాక్‌డౌన్ అనేది కాస్త కఠినంగా ఉన్నప్పటికీ చేసేది లేక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్వీటర్‌లో చేసిన ఓ వీడియో ఇప్పుడు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతోంది.
ఇది ‘ఆన్‌లైన్ కోచింగ్ అలెర్ట్’ అంటూ ఓ నవ్వుల బాణాన్ని అభిమానులపైకి విసిరాడు. అది కూడా తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఆన్‌లైన్ కోచింగ్ అలెర్ట్ పేరిట అభిమానుల ముందుంచాడు. ‘ మీలో అంతర్లీనంగా ఉన్నరజనీకాంత్‌ను బయటకు తీయండి’ అంటూ కామెంట్ చేశాడు. అది సినిమా కాబట్టి అందులో పేలుడు పదార్థాలు ఉపయోగించారని, మీరు(అభిమానులు) మాత్రం అలా బాంబులు విసరవద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ ఫీల్డింగ్ డ్రిల్‌ను కేవలం సాఫ్ట్‌బాల్స్‌తో మాత్రమే ప్రాక్టీస్ చేయాలని సూచించాడు. దీనికి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ తరహా వీడియోలను మరికొన్ని పోస్ట్ చేస్తున్న నెటిజన్లు.. చూశావా ఇది మా ఆన్‌లైన్ కోచింగ్ అలెర్ట్ అంటూ దీటుగా బదులిస్తున్నారు. ఏది ఏమైనా అశ్విన్ పోస్ట్ చేసిన వీడియో నవ్వులు పూయించడంతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.