‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమాపై ఒక క్లారిటీ అయితే అందరికీ వచ్చేసింది. తన 22వ సినిమాని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులకు అనుకున్నదానికంటే ఎక్కువ టైం పడుతుండటంతో.. త్రివిక్రమ్ ను కంగారు పెట్టకుండా తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఓ సినిమా సెట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇది అతని కెరీర్లో 22వ సినిమాగా (aa22xa6 movie) తెరకెక్కుతుంది. అట్లీకి ఇది 6 వ సినిమా. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.
ఇందులో అల్లు అర్జున్ కు రూ.250 కోట్లు, అట్లీకి రూ.100 కోట్లు పారితోషికంగా ఇస్తున్నట్టు తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోని వదిలారు. అది ఏ రేంజ్లో వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు. అల్లు అర్జున్, అట్లీ ఇద్దరూ కూడా తమ ఇమేజ్ ను పక్కన పెట్టేసి.. పాన్ ఇండియా రీచ్ వచ్చేలా ఈ సినిమా చేయబోతున్నారు.
అందుకే రెగ్యులర్ కమర్షియల్ జోనర్లో కాకుండా సైన్స్ ఫిక్షన్ అండ్ టైం ట్రావెల్ అడ్వెంచరస్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అటు అట్లీ ‘జవాన్’ తో వెయ్యి కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యాడు. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తో వెయ్యి కోట్ల క్లబ్లో జాయిన్ అయిన సంగతి విదితమే.కాబట్టి వీరి కలయికలో రూపొందే సినిమాకి 2 వేల కలెక్షన్స్ ను ఆశిస్తాయి ట్రేడ్ వర్గాలు. రాజమౌళి- మహేష్.. సినిమా కంటే ముందే 2 వేల కోట్లు కొల్లగొట్టగల సత్తా ఈ కాంబినేషన్ కు ఉంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ- ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి. ఈ సినిమా కథ ప్రకారం.. ముగ్గురు హీరోయిన్లు ఉండాలి. ఆల్రెడీ ఈ సినిమాలో హీరోయిన్లుగా జాన్వీ కపూర్, అనన్య పాండే..లని ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ కోసం కూడా గాలిస్తున్నారు మేకర్స్. వీళ్ళు మాత్రమే కాదు చిన్న, చితక పాత్రల్లో కూడా కొంతమంది పాపులర్ హీరోయిన్లు నటిస్తారట.
మరోపక్క ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. అట్లీ ఈ సినిమాలో అల్లు అర్జున్ తో డబుల్ రోల్ ప్లే చేయిస్తున్నట్టు టాక్ నడిచింది. అయితే దానికి మించిన అప్డేట్ ఇప్పుడు తమిళ మీడియా వర్గాల్లో నడుస్తుంది. వారి టాక్ ప్రకారం.. ఈ సినిమాలో అల్లు అర్జున్ డబుల్ రోల్ కాదు ట్రిపుల్ రోల్ చేస్తున్నాడట. ఇందులో 2 పాత్రలు రెగ్యులర్ గానే ఉంటాయట. కానీ 3వ పాత్ర మాత్రం ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని విధంగా ఉంటుందట. ఈ పాత్ర బ్యాక్ డ్రాప్ నచ్చడం వల్లనే బన్నీ.. అట్లీతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. మరి ఆ పాత్ర ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి.