ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ఈ నెల 20 వరకు రిమాండ్..

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో పనిచేసిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఏ31 నిందితుడిగా ఉన్న సీఎంవో మాజీ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, ఏ32 నిందితుడిగా ఉన్న మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలకు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

 

శుక్రవారం రాత్రి సీఐడీ అధికారులు వీరిద్దరినీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం వారిని నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, నిందితులిద్దరికీ రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు.

 

ఈ మద్యం కుంభకోణం కేసులో రాష్ట్ర నేరపరిశోధన విభాగం (సీఐడీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు మొత్తం ఏడుగురు వ్యక్తులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. గతంలో రాజ్‌ కసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి, దిలీప్‌, గోవిందప్ప బాలాజీలను అరెస్టు చేయగా, తాజాగా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టుతో ఈ సంఖ్య ఏడుకు చేరింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు, ఈ కుంభకోణంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు అత్యంత కీలకమైన పాత్ర పోషించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. వారి పాత్రపై మరింత లోతుగా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *