ఐపీఎల్ ను ఒక వారం పాటు నిలిపివేస్తున్నాం: బీసీసీఐ అధికారిక ప్రకటన..

ప్రస్తుతం జరుగుతున్న టాటా ఐపీఎల్ 2025ను తక్షణమే వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారిక ప్రకటన చేసింది. ఇటీవలి ఉగ్రదాడి, పాకిస్థాన్ సాయుధ బలగాల దుందుడుకు చర్యలు, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు నేటి మధ్యాహ్నం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.

 

ఐపీఎల్ పాలకమండలి అన్ని కీలక భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చాలా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల ఆందోళనలను, మనోభావాలను తెలియజేశాయని, అలాగే ప్రసారదారులు, స్పాన్సర్లు, అభిమానుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు. పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసిన తర్వాత, సంబంధిత అధికారులు, భాగస్వాములతో చర్చించి టోర్నమెంట్ కొత్త షెడ్యూల్, వేదికల వివరాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

 

మన సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలపై, సంసిద్ధతపై బీసీసీఐకి పూర్తి విశ్వాసం ఉందని, అయినప్పటికీ అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకోవడం వివేకవంతమని భావించినట్లు బోర్డు తెలిపింది. ఈ కీలక తరుణంలో బీసీసీఐ దేశానికి పూర్తి అండగా నిలుస్తుందని స్పష్టం చేసింది.

 

కాగా, భారత ప్రభుత్వానికి, సాయుధ దళాలకు, దేశ ప్రజలకు తమ సంఘీభావాన్ని ప్రకటించింది. ఇటీవలి ఉగ్రదాడి, పాకిస్థాన్ సాయుధ బలగాల అకారణ దురాక్రమణకు దీటుగా బదులిస్తూ, ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా దేశాన్ని రక్షిస్తూ, స్ఫూర్తినిస్తున్న మన సాయుధ బలగాల ధైర్యసాహసాలకు, నిస్వార్థ సేవకు బీసీసీఐ వందనం సమర్పించింది.

 

క్రికెట్… మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన క్రీడ అయినప్పటికీ, దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదని బీసీసీఐ నొక్కి చెప్పింది. భారతదేశాన్ని రక్షించే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి బీసీసీఐ కట్టుబడి ఉందని, ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది.

 

ఈ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలిపి, అర్థం చేసుకున్నందుకు లీగ్ అధికారిక ప్రసారదారు జియోస్టార్‌కు బీసీసీఐ ధన్యవాదాలు తెలియజేసింది. అలాగే, టైటిల్ స్పాన్సర్ టాటా, ఇతర అనుబంధ భాగస్వాములు, వాటాదారులందరూ కూడా దేశ ప్రయోజనాలను అన్నింటికంటే ఉన్నతమైనవిగా భావించి, ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *