మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌పై మరో కొత్త కేసు నమోదైంది. తాజాగా దిల్లీ పోలీసులు సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఛైల్డ్ పోర్నోగ్రఫీకి అనుమతి ఇచ్చిందనే ఆరోపణలతో పోలీసులు ట్విట్టర్‌పై కేసు నమోదు చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ (NCPCR) అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళవారం కేసు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ట్విట్టర్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (IPC), ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ (ఫోక్సో) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ విషయంపై ట్విట్టర్ ప్రతినిధి ఒకరు స్పందించారు. పిల్లలపై లైంగిక దాడి(సీఎస్ఐ) పట్ల కంపెనీకి జీరో టాలరెన్స్ పాలసీ ఉందని, మైనర్లపై లైంగిక దాడి ఎదుర్కోవడానికి చురుకైన విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. పిల్లలపై లైంగిక దాడులను ఎదుర్కోవడంలో తాము ముందు వరుసలో ఉంటామని, ఆన్ లైన్ వేదికగా వారిపై జరిగే అకృత్యాలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సాధనాలపై పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.