భారత్-పాక్ ఉద్రిక్తతలు.. జీ7 దేశాల కీలక పిలుపు..

భారత్, పాకిస్థాన్‌లు అత్యంత సంయమనం పాటించాలని, తక్షణమే సైనిక ఘర్షణను తగ్గించుకుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రపంచంలోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏడు దేశాల కూటమి (జీ7) పిలుపునిచ్చింది. అణుశక్తి కలిగిన ఈ రెండు పొరుగు దేశాల మధ్య సైనిక ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

“పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, దౌత్యపరమైన చర్చల ద్వారా శాశ్వత పరిష్కారానికి మా మద్దతు ఉంటుందని జీ7 దేశాలు స్పష్టం చేశాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా విదేశాంగ మంత్రులతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధి ఈ మేరకు ఆదివారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. “ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్, పాకిస్థాన్‌లు అత్యంత సంయమనం పాటించాలని కోరుతున్నాం” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

సైనికపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగితే అది ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని జీ7 విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. “ఇరువైపులా ఉన్న పౌరుల భద్రత గురించి మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము” అని వారు తెలిపారు. “తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని, శాంతియుత పరిష్కారం కోసం ఇరు దేశాలు ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనాలని మేం పిలుపునిస్తున్నాం” అని వారు తమ ప్రకటనలో వివరించారు.

 

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అటారీ-వాఘా సరిహద్దు వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) భద్రతను కట్టుదిట్టం చేసిన దృశ్యాలు ఉద్రిక్త పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జీ7 దేశాల ప్రకటన వెలువడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *