ఈ-కామర్స్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ వంటి ఆన్‌లైన్ సర్వీసుల ఊతంతో దేశీయంగా వినియోగదారులకు సంబంధించిన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2030 నాటికి 800 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2020లో ఇది 85-90 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్రౌండ్ జీరో 5.0 కార్యక్రమంలో ఆవిష్కరించిన కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఆవిష్కరించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక, ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారం వార్షిక పరిమాణం ఈ ఏడాది 55 బిలియన్ డాలర్లను తాకనుండగా..2030 నాటికి ఏకంగా 350 బిలియన్ డాలర్లకు చేరనుంది. తద్వారా అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద రిటైల్‌మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించనుంది. అటు కిరాణా దుకాణాల విక్రయాలు 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని రెడ్ సీర్ పేర్కొంది. ‘సౌకర్యం కారణంగానే ఆన్‌లైన్ సర్వీసులు వినియోగిస్తున్నామని ప్రస్తుతం 50 శాతం మంది కస్టమర్లు చెబుతున్నారు. అదే కొన్నేళ్ల క్రితం అయితే డిస్కౌంట్ల గురించి ఉపయోగిస్తున్నామని చెప్పేవారు. కోవిడ్ పరిస్థితులే తాజా మార్పులకు కారణం’ అని రెడ్‌సీర్ వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ తెలిపారు. తదుపరి తరం ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. భారత మోడల్‌ను అంతర్జాతీయంగా కూడాప్రాచుర్యంలోకి తెచ్చే విధమైన కొత్త ఆవిష్కరణలను సృష్టించగలరని ఆయన పేర్కొన్నారు. ( Covid Second wave: దేశీయ బ్యాంకుల కష్టాలు )
ప్రత్యామ్నాయ కేంద్రంగా భారత్: నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్
మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని నివేదికవిడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఇతర దేశాల్లోని సంస్థలు తమ కార్యకలాపాలను వేరే దేశాలకు మార్చుకునేందుకు తగు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయన్నారు. భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని.. తద్వారా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో కీలక భాగం కావచ్చని కాంత్ తెలిపారు. మరోవైపు, భారీ పెట్టుబడులు అవసరమైన చిప్ పరిశ్రమ భారత్‌లో ఏర్పడే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్‌చంద్రశేఖరన్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు.. సెమీ కండక్టర్ వ్యవస్థపై ఇన్వెస్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టీవీ మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయ పడ్డారు. నివేదిక ప్రకారం.. 2020-30 మధ్య కొత్తగా జతయ్యే ఆన్‌లైన్ షాపర్స్‌లో 88 శాతం మంది ద్వితీయ శ్రేణి తదితర నగరాలకు చెందిన వారై ఉంటారు. ఈ-కామర్స్ వ్యాప్తి చెందే కొద్దీ ప్రత్యేక డెలివరీ సర్వీసుల అవసరం కూడా పెరిగింది. ( LPG Cylinder Price: వినియోగదారులపై మరో ‘బండ’ )