ఆపరేషన్ సింధూర్..! ఉగ్రమూకల స్థావరాలను భూస్థాపితం..

శత్రుదేశంలో తగ్గేదేలే అన్నట్లుగా భారత్‌ దాడి చేసింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్ చొచ్చుకెళ్లి..ఉగ్రమూకల స్థావరాలను భూస్థాపితం చేశాయి. అయితే ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? ఈ పేరు ఎందుకు పెట్టారన్న చర్చ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొదలైంది.

 

ఆపరేషన్ సింధూర్‌ అర్థం వెనుక అనేక భావోద్వేగాలున్నాయి. మనం భారతదేశాన్ని భరతమాతగా కీర్తిస్తాం. ఇక జమ్మూ కశ్మీర్‌ను దేశానికి తలగా భావిస్తాం. అయితే ఇలాంటి కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడి చేయడంతో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. భరతమాత నుదుటిపై ఈ దాడి జరిగినట్లుగా భావించింది. ఈ ఉగ్రదాడిలో చనిపోయిన భారతీయుల రక్తాన్ని సింధూరంతో పోల్చింది. అందుకే పీవోకేలో భారత ఆర్మీ చేపట్టిన చర్యకు కేంద్రం ఆపరేషన్ సింధూర్‌గా నామకరణం చేసింది.

 

మన దేశంలో మహిళలకు సింధూరం చాలా ముఖ్యమైనది. దీన్ని నుదుటిపై పెట్టుకుంటారు. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేశారు. ముఖ్యంగా మగవారినే పొట్టన పెట్టుకున్నారు ఉగ్రమూకలు. ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు సింబాలిజంగా చూపిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేశారు.

 

ఇదిలా ఉంటే.. భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా..ఇవాళ దేశ వ్యాప్తంగా భద్రతా విన్యాసాలు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పౌరులను, భద్రతా సిబ్బందిని సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ మాక్ డ్రిల్స్ చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

 

అయితే దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ జరుగుతున్న వేళ..భారత్ సైన్యం ఆకస్మాత్తు దాడులు చేయడంతో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముందే దాడులు చేస్తామనే తెలిసే..కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్‌కు ప్లాన్ చేసినట్లు ఈ దాడులను భట్టి తెలుస్తోంది.

 

ఇక హైదరాబాద్‌లోనాలుగు వ్యూహాత్మక ప్రాంతాలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ , మౌలాలిలోని ఎన్‌ఎఫ్‌సీ‌లలో భద్రతా విన్యాసాలు జరగనున్నాయి.

సాయంత్రం 4 గంటలకు ఈ భద్రతా విన్యాసాలు ఏకకాలంలో జరగనున్నాయని రక్షణ శాఖ తెలిపింది.

 

‘సివిల్‌ డిఫెన్స్‌ జిల్లా’ల్లో సైరన్లు మోగనున్నాయి. అణు ఇంధన కర్మాగారాలు, సైనిక స్థావరాలు, చమురుశుద్ధి కర్మాగారాలు, విద్యుదుత్పత్తికి వాడే జలాశయాలు వంటివాటిని యుద్ధ సమయంలో ఎలా కాపాడుకోవాలనేదానిపై క్షేత్రస్థాయిలో సన్నద్ధత తీసుకురానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *