హైకమాండ్ పిలుపు డిల్లీకి రేవంత్..! ఎందుకంటే..?

తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉంటుందా? హైకమాండ్ పిలుపు వెనుక అసలు ఉద్దేశం ఏంటి? సీఎం రేవంత్ తోపాటు పీసీసీ, డిప్యూటీ సీఎం, మంత్రులు రావాలని కబురు పెట్టిందా? కొందరు నేతలు సైతం హస్తినకు వెళ్లాలని డిసైడ్ అయ్యారా? అసలు ఏం జరుగుతోంది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

 

హస్తినకు రావాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలకు పిలుపు వచ్చింది. వారిలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ నుంచి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉన్నట్లుండి అధిష్ఠానం నుంచి అకస్మాత్తుగా పిలుపు రావడంతో దేనికంటూ నేతలు చర్చించుకోవడం మొదలైంది. కేబినెట్ విస్తరణ, పార్టీ పదవుల కోసమేనని చర్చించుకుంటున్నారు.

 

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారీ కేబినెట్ విస్తరణ అంటూ ఊహాగానాలు జోరందుకునేవి. ఈసారి హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో కచ్చితంగా విస్తరణ ఖాయమనే ప్రచారం అప్పుడే నేతల్లో మొదలైంది. మంత్రివర్గ విస్తరణపై ఈసారి కచ్చితంగా నిర్ణయం తీసుకోవడం ఖాయమని కాంగ్రెస్‌ వర్గాల మాట.

 

గతంలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ రాష్ట్ర నేతలతో పలుదఫాలుగా చర్చించారు. రెండు నెలల కిందట నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ తర్వాత హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఈసారి కచ్చితంగా విస్తరణ ఉండడం ఖాయమని అంటున్నారు.

 

నీటిపారుదల శాఖకు చెందిన కార్యక్రమాల్లో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. విస్తరణలో నలుగురికి అవకాశం దక్కే అవకాశమున్నట్లు సమాచారం. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, వివేక్, సుదర్శన్‌రెడ్డిలతోపాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

విస్తరణ విషయం తెలియగానే కొందరు నేతలు ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఢిల్లీ పెద్దలతో తమకున్న పరిచయాల ద్వారా లాబీయింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తే, కనీసం పార్టీలో కీలకమైన పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఆ విధంగా చాలామంది నేతలు ఉన్నారు కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *