హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు షురూ..!

హైదరాబాద్‌లో ప్రపంచ దేశాల అందగత్తెల సందడి షురూ అయ్యింది. కొన్నిరోజుల్లో జరగనున్న పోటీల నేపథ్యంలో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఒకొక్కరుగా భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఆయా బ్యూటీల సందడి క్రమంగా మొదలైంది.

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ నుంది 72వ మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు. దీనికోసం ఏర్పాట్లు దాదాపుగా జరిగిపోయాయి. మే 10 నుంచి 31 వరకు జరగనున్నాయి. సమయం దగ్గరపడుతుండడంతో వివిధ దేశాల చెందిన అందగత్తెలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. మిస్ వరల్డ్ పోటీల సీఈఓ ఛైర్‌పర్సన్ జూలియో ఈవెలిన్ మోర్లీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

 

భాగ్యనగరానికి అంతగత్తెలు రాక

 

తాజాగా కెనడా నుంచి శనివారం సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మిస్‌ కెనడా ఎమ్మా మోరిసన్‌ హైదరాబాద్‌కు చేరుకుంది. ఆమెకు స్థానిక సంప్రదాయాల ప్రకారం శాస్త్రీయ నృత్యాలతో ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు.

 

తెలంగాణ సంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి నుదుటన బొట్టుపెట్టి, మెడలో పూలమాల వేసి ఆహ్వానించారు. ఎయిర్‌పోర్టు నుంచి అతిథ్యం ఇచ్చే హోటల్‌కు వెళ్లారు. ఈ రెండు రోజుల్లో 120 దేశాల నుంచి అందగత్తెలు, ప్రతినిధులు భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు.

 

మే 10న గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం వేదికగా పోటీల ప్రారంభోత్సవం జరగనుంది. మే 13న చార్మినార్, లాడ్‌ బజార్‌లో అందగత్తెల హెరిటేజ్ వాక్ జరగనుంది. అదే రోజు చౌమొహల్లా ప్యాలెస్‌లో మ్యూజికల్ కాన్సర్ట్, వెల్‌ కమ్ డిన్నర్ ఉండనుంది.

 

మే 14న అందగత్తెలు పలు బృందాలు విడిపోనున్నారు. వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, అక్కడి కోటను సందర్శించనుంది. మరో బృందం రామప్ప ఆలయానికి వెళ్లనుంది. మే 15న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శిస్తుంది మరొక టీమ్. పోచంపల్లికి వెళ్లి అక్కడ నేసే ప్రత్యేకమైన చీరలను పరిశీలిస్తుంది ఇంకో టీమ్.

 

మే 16న మెడికల్ టూరిజంలో భాగంగా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ-ఏఐజీని సందర్శిస్తుంది. ఈవెంట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా హెల్త్‌ టూరిస్టులను ఆకర్షించాలని భావిస్తోంది ప్రభుత్వం. తక్కువ ఖర్చుతో అందిస్తున్న వైద్య సేవలు, మెడికల్‌ టూరిజంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని తెలియజేయనుంది. మరో బృందం మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లల మర్రి, ఎకో టూరిజం పార్కుకు వెళ్లనుంది.

 

మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వచ్చిన అందగత్తెలకు స్పోర్ట్స్ ఫినాలే ఉండనుంది. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్తారు. మే 18న తెలంగాణ సచివాలయం, పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను విజిట్ చేయనున్నారు. పర్యాటకుల భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యత వివరాలను తెలుసుకుంటారు.

 

షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం

 

మే 20, 21న మాదాపూర్‌లోని టీహబ్‌ను సందర్శించనున్నారు. మరుసటి రోజు మే 21న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను తిలకించనుంది. మరో బృందం శిల్పారామంలో ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్‌షాప్‌లో పాల్గొంటుంది.

 

మే 22న మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే జరగనుంది. మే 23న మిస్ వరల్డ్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలే నిర్వహించనున్నారు. మే 24న ఫ్యాషన్ ఫినాలే, జ్యుయలరీ ఫ్యాషన్ షో ఉంటాయి. మే 26న హైటెక్స్‌ వేదికగా బ్యూటీ విత్ పర్పస్, గాలా డిన్నర్ కార్యక్రమం జరుగుతుంది. మే 31న హైటెక్స్‌ వేదికగా మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీ జరగనుంది.

 

ఈవెంట్‌లో 120 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. 150పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది . మిస్‌వరల్డ్‌ 2025 పోటీదారులు వచ్చే ఎయిర్‌పోర్టు నుంచి వారి ఉండే హోటళ్ల వరకు భద్రత ఏర్పాటు చేశారు. బ్యూటీలు సందర్శించే ప్రదేశాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *