పహల్గామ్ ఉగ్రదాడిపై పిల్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా క్లిష్టమైన సమయమని, ఇలాంటి సున్నితమైన విషయాల్లో పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.

 

భద్రతా బలగాల స్థైర్యం దెబ్బతీయొద్దు

 

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్‌పై కొంత అసహనం వ్యక్తం చేసింది. “దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పౌరులందరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి రావాలి. ఇలాంటి వ్యాజ్యాలు వేసే ముందు వాటి సున్నితత్వాన్ని అర్థం చేసుకోవాలి. మీ చర్యల ద్వారా భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా? దేశం పట్ల మీకు కూడా బాధ్యత ఉందని గుర్తుంచుకోండి” అని ధర్మాసనం హితవు పలికింది. ఉగ్రవాద దాడుల వంటి అంశాలను న్యాయ సమీక్ష పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నించవద్దని స్పష్టం చేసింది.

 

“ఉగ్రవాద దాడుల ఘటనల విచారణ విషయంలో న్యాయమూర్తులు నిపుణులు కారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయి” అని ధర్మాసనం పేర్కొంది.

 

అయితే, తాను ఇతర రాష్ట్రాల్లోని కశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే ఈ వ్యాజ్యం దాఖలు చేశానని పిటిషనర్ కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశమైతే సంబంధిత హైకోర్టులను ఆశ్రయించవచ్చని సూచించింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *