సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానమంత్రి మోదీ కీలక భేటీ..

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో, భద్రతా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కీలక భేటీలో దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

 

సుమారు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్‌ తో పాటు త్రివిధ దళాల అధిపతులు, ఇతర కీలక భద్రతా అధికారులు హాజరయ్యారు. ప్రధాని నివాసం ఈ అత్యున్నత స్థాయి చర్చలకు వేదికైంది.

 

ముఖ్యంగా పహల్గామ్ దాడి అనంతర పరిణామాలు, సరిహద్దుల్లో ప్రస్తుత భద్రతా వాతావరణం, దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై కీలక వ్యూహరచన జరిగినట్లు తెలుస్తోంది.

 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే జాతీయ సంకల్పమని ప్రధాని పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పహల్గామ్ దాడికి పాల్పడిన వారికి తగిన రీతిలో గట్టి బదులిస్తామని కూడా ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

 

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలోనూ..

 

ఇదిలా ఉండగా, ఇదే అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనూ మంగళవారం సాయంత్రం మరో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

 

కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వివిధ కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) డైరెక్టర్ జనరల్స్ పాల్గొన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), సహస్ర సీమ బల్ (ఎస్ఎస్‌బీ), ఇండో-టిబిటెన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), అస్సాం రైఫిల్స్ డీజీలు ఇందులో పాల్గొని, పహల్గామ్ దాడి అనంతర చర్యలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *