ఏపీలో ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన దువ్వాడ శ్రీనివాస్ ను తాజాగా ఆ పార్టీ సస్పెండ్ చేసింది. వ్యక్తిగత కారణాలతో ఆయన్ను సస్పెండ్ చేశారు. దీనిపై ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో వైసీపీ నిర్ణయంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 22న వైసీపీ తనను సస్పెండ్ చేసినట్లు చేసిన ప్రకటనపై ఆ పార్టీ ఉత్తరాంధ్ర నేత దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. వైసీపీ ప్రకటనపై తాను స్పందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ వీడియో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా వైసీపీలో ఈ హోదా తనకు ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ కోసం తాను చాలా కష్టపడ్డానని, పార్టీ గొంతై మాట్లానని, పార్టీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శలు చేశానన్నారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత కారణాలు చూపుతూ సస్పెండ్ చేశారని తెలిసిందన్నారు.
ఇందుకు పార్టీ తనకు అందించిన సహకారం, రాజశేఖర్ రెడ్డితో అడుగు వేసిన తాను, జగన్ తో నడుస్తున్న తాను, తన హృదయంలో జగన్ స్ధానం సుస్దిరం అన్నారు. రాజకీయ క్రీనీడలో తాను బలైనట్లు భావిస్తున్నట్లు తెలిపారు. పాతికేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తాను, ప్రజాసేవనే పరమావధిగా భావించిన తాను ఏరోజూ పార్టీకి ద్రోహం చేయలేదని, లంచాలు తీసుకోలేదని, అవినీతి చేయలేదని, భూకబ్జాలు చేయలేదన్నారు.
జరిగిన పరిణామాన్ని తాను స్వీకరిస్తున్నట్లు దువ్వాడ తెలిపారు. సస్పెన్షన్ అనేది తాత్కాలిక విరామమే అన్నారు. విరామం ఎరుగక పనిచేయాలన్న గురజాడ అప్పారావు చెప్పిన ఓ మాటను ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. తాను అలాగే విరామం లేకుండా తనను నమ్ముకున్న ప్రజలు, గ్రామాల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానన్నారు. తన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన అభిమానులంతా ధైర్యంగా ఉండాలని కోరారు.
గ్రామ గ్రామాన మళ్లీ తిరుగుతానని, ప్రతీ ఇంటికి తాను వస్తానని దువ్వాడ తెలిపారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న తాను ఎవరినీ వదిలిపెట్టే పరిస్ధితి లేదన్నారు. కష్టపడి పనిచేస్తానని, అన్నింటికీ కాలమే తీర్పు చెప్తుందని తాను నమ్ముతానన్నారు. ఇంతవరకూ ఈ గౌరవం ఇచ్చిన ప్రజలందరికీ, ముఖ్యంగా టెక్కలి ప్రజలకు సాష్టాంగ ప్రణామాలు చేస్తానన్నారు. ఊపిరి ఉన్నంతవరకూ మీ సేవలో నిమగ్నం అయి ఉంటానని, తన అవసరం ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమైన ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడేందుకు కృషి చేస్తానన్నారు. వైసీపీలో పనిచేసే అవకాశం ఇచ్చిన జగన్ కు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.